శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది.
నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో అక్రమాలపై విచారణ చేపట్టి గుర్తింపులేని కాలేజీలను రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త రాజేశ్ దాఖలు చేసిన పిల్ మీద హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు ఇంటర్ బోర్డును ఆదేశించింది. కాలేజీల్లో అక్రమాలు జరగడంతో పాటు వాటికి ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్ఓసీలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ జరిపింది. అనంతరం నివేదికను హైకోర్టుకు అందించింది. వాస్తవానికి మార్చిలోనే వాటిని మూసేయాల్సి ఉంది. అయితే, అందులో 29,808 మంది విద్యార్థులు చదువుతుండడం, పరీక్షలు కూడా ఉండడంతో కొంత వాయిదా పడింది.
Source: telugu.news18.com