Telangana: Engineering Classes Commence From 17th August

తెలంగాణలో ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ క్లాసులు షురూ..
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.
విద్యావ్యవస్థకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలివే:
– విద్యావ్యవస్థ పవిత్రత (academic sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని తెలిపారు.
– ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి.
– విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
– రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది.
Source: TV9 Telugu